Jagathguru Bhodalu Vol-6        Chapters        Last Page

జగజ్జనని సేవ

మనకు మూడువిధములైన తల్లులున్నారు. మొదటిది కన్నతల్లి; మన జన్మకు కారణమయినది. రెండవది గోమాత; పెరిగి పెద్దయిన తరువాత మనకందరికీ పాలిచ్చే తల్లి. మూడవది జన్మభూమి; 'జననీ జన్మభూమిశ్చ స్వర్గా దపి గరీయసీ.' మొదటి తల్లి స్తన్యమిచ్చి, మనలను పెంచుతుంది. ప్రజల కందరికీ పాలిచ్చి పెంచేది గోమాతనీరూ, ఆహారమూ ఇచ్చి దేహవర్ధనమూ, ఆత్మవర్ధనమూ చేసే తల్లి జన్మభూమి. అచేతనమైనా, ఆమెలో దైవసాన్నిధ్యమున్నది. అందుచేతనే ఆమెను భూదేవి అని వ్యవహరిస్తున్నాం. హిమాచలం నుంచి కన్యాకుమారివరకూ ఉన్న భూభాగాన్ని మన జన్మభూమి, భారతమని అంటున్నాం. ఈమూడు తల్లులకూ మూలమైన తల్లి పరాశక్తి. ఆ పరాశక్తిని 'జగతఃపితరౌ వందే పార్వతీ రమేశ్వరౌ' అని కాళిదాసు నమస్కరిస్తాడు. ఆమెసాన్నిధ్యం ఈ మూవురిలోనూ ఉంటూ, అంతేకాక ఈ మూటికీ అతీతంగా, అణువణువులోనూ సర్వమంగళ సర్వసాన్నిధ్యం వహించినదా అని అనిపించేటట్టు వుంటుంది. అందుచేత మనం కన్నతల్లికీ, గోమాతకూ, భూమాతకూ, ఆ జగన్మాత స్మరణతో సేవచేయాలి. ఈ సేవలన్నీ ఆ పరాశక్తికి సేవలే. ఆమె ప్రత్యేకంగా సేవలు కోరటంలేదు. ఈ సేవలే నా సేవలు అంటుంది.

6-17)

పెద్దపెద్దకవులూ, యోగులూ, సంగీత శాస్త్రజ్ఞులూ నానయోగంలో నైపుణ్యం సాధించినవారూ- ఎన్నో శ్లోకాలూ, కీర్తనలూ వ్రాశారు. బమ్మెర పోతనగారి భాగవతం, నారాయణతీర్థుల తరంగాలూ ఇవన్నీ ఈ కోవలోనివే. ఇవన్నీ ఎందుకూ? మనకు పరమాత్మ స్మరణ చేతుమనీ, సత్కర్మ లాచరించమనీ, నదాచారులై వుండమనీ బోధచేయడానికే, దైన్యంవదలి ధైర్యంగావుండి మాతృసేవ, గోసేవ, భూసేద చేయమనుటకే. మూలకారణుడైన భగవంతునిలో ప్రపత్తికుదిరితే, ఈ మూవురమ్మల సేవకు కావలసిన శక్తీ ధైర్యమూ కల్గుతుంది. పెద్దలు చేసినదంతా జ్ఞానబోధకే కాని తమ్ము తరించుకొవటానికి కాదు.

ఉపనిషత్తుల ప్రచారమూ, భారత భాగవతముల ప్రచారమూ ప్రపంచంలోతగ్గేసరికి, సేవాభావంక్రమక్రమంగా లోపించింది. పరాశక్తి సేవ మానటమేకాక, ఆ సేవ నిందనీయంగా కూడా కనిపిస్తున్నది. మన సంతతివారికి పరాశక్తి స్వరూపం మన దృష్టిలోనుంచి తొలగేసరికి, మతాంతర ప్రవేశానికి మంచి అవకాశం ఏర్పడింది. మన పితృపితామహులు ఏ తల్లిని ఏ పరాశక్తిని ఉపాసిస్తూ వచ్చారో, ఆ పరాశక్తి సేవనువదలి, దాని నిందకు అనేక ప్రజలుపాల్గొని, ఆనిందను మనం వినేంతటి దౌర్భగ్యం కూడా మన కాలంలో ఏర్పడింది. ఎవరో పూర్వులు, బలాత్కారంచేతనో, చాపల్యం చేతనో, ఈశ్వరభక్తిదూరులై, పెద్దల ధర్మాచరణవిమర్శకూ నిందకూ పాల్గొన్నారు. దానితో ప్రస్తుతపు అధోగతి దాపురించింది.

కనీసం ఇక రాబోయే సంతతికైనా, ఈ పాపం తటస్థం కాకుండా, అందరూ సన్మార్గంలో- ప్రేమప్రవృత్తిలో, ధర్మపథంలో ధీరంగా అడుగులు వేయడానికి అనుకూలంగావుండేటట్లు, మనం ఈసేవాభావాన్ని పునరుద్ధరించ వలసిన అవసరం ఎంతైనా వున్నది. ప్రతిగ్రామంలోనూ, నగరంలోనూ, కొన్ని సంఘాలు దీనికొరకై ఏర్పరచి మతాంతరాలు, ఎట్లు తమ తమ మతాలను విరళీకరిస్తున్నవో. తెలియచెప్పి అమాయకులైన ప్రజలు లొంగిపోనట్లు చూడాలి. ఇది మనం చేయవలసిన ధర్మరక్షణ. మనమతాన్ని ఎక్కడెక్కడ చెడగొట్టటానికి ప్రయత్నాలు జరుగుతున్నవో, అక్కడక్కడా కొన్ని సంఘాలు సేవాభావంతో, ప్రజలు దైన్యానికి లొంగిపోనట్టు ధైర్యం చెప్పి అనూచానంగా వస్తున్న ధర్మవ్యవస్థకు చ్యుతిలేనట్లు చూడటం, మతైక్యతకేకాక, దేశైక్యతకు కూడ చాల అవసరం. ప్రజల కందరికీ, మానసికంగానైనా ఈశ్వరభక్తిని పెంపొందించడం, ధర్మనిరతిలో ఇచ్ఛనురేకెత్తించడం-చాల ముఖ్యం. మతాంతరం తీసుకొన్న వారికి, మళ్ళా ఆమతం విడిచిరావటం కష్టమైనా, వారి భావనలోనైనా, మన మతం గూర్చి ఉన్న దురుద్దేశాలను తొలగించటం మంచిది. రాష్ట్రీయస్వయంసేవకులు, ఐచ్ఛికసేవకులు మన ప్రజలకు ధర్మంలో ఎంత భక్తిశ్రద్ధలున్నవో తెలపడానికి వారే నిదర్శనం. మతంపై, ప్రజలకు సాధారణంగా ఎంత తీవ్రమైన భావం వుంటుందో, తెలుసుకోడానికి వంగదేశ##మేచాలు. ప్రాణాలకు తెగించి, ఇళ్ళువాకిళ్ళూ పోయినా, మానంభంగమయినా, కుటుంబం బిడ్డలూ నశించినా అన్నిటీనివదలి, మత ధర్మంపై ఉన్న అభిమానంతో మతాన్ని నిలుపుకొన్నవాళ్ళు వంగీయులు. ఇప్పటికీ మన దేశంలో ఉన్న ధర్మనిరతి, మన పూర్వుల ధర్మభావంయొక్క గాంభీర్యానికి నిదర్శనం. అందుచేత మన మతస్థులు, మతాంతరం పోవటం శోచనీయం. అనాధలైన బిడ్డలను, మతాంతరుల తీసుకొనిపోయి పెంచి పెద్దచేయటం, వారు మతాంతరులు కావటం ఒకతీరు. వివిధ మతాలను సాకల్యంగా పరిశీలించి మతాంతరం స్వీకరించటం మరొక తీరు. అనాధలనూ, అన్నానికి లేనివారినీ మతాంతరులు చేయటం ఋజుమార్గంకాదు. విద్యాదానం, వైద్యసహాయం, ధర్మాన్నిమార్చే ఉద్దేశంతో చేస్తే అది సదుద్దేశం ఎన్నటికీ కాదు. దానితో భగవంతుడు కూడా తృప్తిపొందడు.


Jagathguru Bhodalu Vol-6        Chapters        Last Page